లిపి , వారధి

అక్షరాలుగా రాలు తున్నాయి స్వప్నాలు
స్వప్నాలుగా వర్షిస్తున్నాయి మరల, మరల
రాలు గాయి అక్షరాలు.
అందుకే
నేను ఈ నాటి యువతిని
అక్షరమై మెరుస్తాను.

అక్షరాలు ఆశలను మోస్తాయి
ఆశయాలను ధరిస్తాయి
ఆలోచనలను సంభావిస్తాయి
ఆవేదనల శకలాలను శకటములై మోస్తాయి.
అందుకే అక్షరాలలో నేను
భావనగా హసిస్తాను!

అక్షరాలు క్రాంతికి దోసిలి ఒగ్గుతాయి.
విప్లవాలకు తల లొగ్గుతాయి!
చైతన్యానికి "మొగ్గు" వేస్తాయి.
వినూత్న పరిణామానికి " మొగ్గ " తొడుగుతాయి.
అందుకే నేను అక్షరానికి గొడుగు పడతాను.
అక్షరానికి హారతి పడతాను.

అనంతానంత సుప్త ,సుషుప్త
జాగృత్ హృదంతరాళ
అంతర్మధనాల ఘన వార్ధికి
'రూప కల్పన 'నొసగే "విరించి" అక్షరమే గదూ!

అనంత కాల దిగంతాప్త చరిత్రాలయాన
ప్రతిష్ఠించ బడే దేవత ఈ అక్షరము!
చరిత్ర పెదవుల వంపులను
చిరు నవ్వు గానూ తీర్చి దిద్ద గలదు
వికటాట్ట హాసం గానూ మలచ గలదు.

అక్షరము ఒక "ఉలి"!
అక్షరమే స్వయంభువు ఐన 'శిల్పి" కూడా!

అందుకే ,నేనంటాను
అక్షరమే మదీయ కల్పనా రధ సారధి!
అక్షరమే విభిన్న విశిష్ట వారధి

0 Comments:

Post a Comment