simple flowersచిట్టి చేమంతులు -2

By kadambari piduri, Jan 5 2009 11:57AM


6)సంక్రాంతి సంబరాలు, అంబరమున పతంగీలు 
నీలి నింగి చీర పైన వన్నెల గాలి పటాల అద్దకములు! 

7)నది కెరటాల వీణా తంత్రుల 
జ్యోత్స్నాంగుళులతో 
మీటుచుండెను పున్నమి జాబిలి. 

8)ప్రశ్నార్ధకమల్లే ఎత్తి ఉన్న ఆ తెరచాప! 
నిరంతర జీవన సమరానికి 
"ఛలో! ఛలో! రైట్! రైట్"అంటూ 
వేసిన టిక్ మార్కు వలె 
పడవ సరంగులు వేసే తెడ్డు 

9)జన రద్దీతో జంక్షన్ 
సిగ్నల్ కొమ్మకు తేన పట్టులు. 

10)బల్బు తోరణాల పెళ్ళి వారిల్లు 
బుట్ట గౌనుల పాపాయి. 

11) వాహనాలతో పార్కింగ్ స్టాండు 
వరుస మెట్లతో 'పియానో వాద్యం'. 

12)ఎక్కాల బుక్కులో , గణితముల నోట్సుల్లొ 
ప్లస్ , మైనస్సులు, ఇజీక్వల్టులు 
సాధించు బ్రతుకు లెక్కలకు 
మార్గ సూచికలు. 

13)ఇంటూ,బ్రాకెట్, కుండలినీ 
ఇత్యాదులుగా సమీకరణములు 
సంఖ్యల విలువల తూచు తరాజులు. 

14)పొగాకు కాడలు చుట్టీ, చుట్టీ 
పొగాకు చుట్టను తయారించెను తాతయ్య! 
"అబ్బోసి!!! పాల కడలి తన 'దోసిలి' అంట! 
ఆది శేషుడు పిడికిలిలోనట!!! 

15)బారు, బారులుగ 
నింగిని పక్షులు 
మబ్బుల పసిడిని 
పొదిగిన మణులుగ 
నీలాంబరపు పాపిటి బిళ్ళగ! 

16)పెను ఉరగము పడి ఉందా? 
టూత్ బ్రష్ పై వేసిన పేస్టు! 
(ఉరగము: కొండ చిలవ). 

17)డ్రస్సింగ్ టేబులు, బొట్టు, పౌడర్లు 
గాజులు, సెంట్లు, నెయిల్ పాలిషులు 
అలంకార విజ్ఞాన శాస్త్రమున 
అందము లొలికే బొమ్మల కొలువు. 

18)ఉదయారుణ కిరణాల వెల్లువ 'వల'లో 
సరసులు, తరువులు, సకల సామగ్రి 
మిలమిలలాడే మత్స్యములు. 

19) సాహిత్యములను రచియించమనీ 
భువిపై వరుసగ రేఖలు గీస్తోంది 
ఊచల కిటికీ! 
ఔను మరి! నేడు పున్నమి కదూ! 

20)ఎంబ్రాయిడరీ డిజైనులు 
కుడుతూన్నది వనిత. 
పైకీ, కిందకి సాగే దారము 
నాగిని చేసే నాట్యాలు. 


0 Comments:

Post a Comment