నర్సాపూరు కుర్చీ





;;;;;;;;;;;;

నర్సాపూరు కుర్చీ

జంబునాథంకు గత పదేళ్ళుగా ఒక తీరని కోరిక అలాగే మిగిలి పోయింది.

 అది మరీ తీర్చుకోలేని గొంతెమ్మ కోరికేం కాదు.

జంబు ఓ మధ్య తరగతి ఉద్యోగి. కొంచెం కష్టపడితే ఆ కోరిక సులువుగానే తీరుతుంది కూడాను. కానీ జంబూకీ, పొదుపుకీ చాలా పెద్ద లింకు ఉన్నది. "పొదుపు చేయండోచ్!" అంటూ ఎలుగెత్తి నేషనల్ సేవింగ్సు వారి ద్వారా ఘోష ప్రభుత్వ ప్రచారానికి తగిన విధేయుణ్ణి చూపించమంటే ఇదిగో ఈ జంబునాథాన్ని చూపించి చక్కా ప్రైజుని కొట్టేయవచ్చు.

ఏతా వాతా తేలేదేమంటే జంబునాథం బహు పొదుపరి!

 డబ్బు తప్పని సరైతే తప్ప ఖర్చు పెట్టే ప్రశ్నే లేదు. పోనీ అంటే,

 పూర్వ కాలంలో రెక్కలు కట్టుకుని ఎగిరి వచ్చి, 

వరాలను గుప్పించే దేవుళ్ళూ,గంధర్వ కన్యలూ ఈ కాలంలో లేరు గదా, ఖర్మ!

ఇంతకీ మన హీరో గారి కోరిక ఏమిటంటే మరీ పెద్దదేం కాదు. జంబుకి ఊహ తెలిసినప్పటినుంచీ "నరసరావు పేట కుర్చీ" తన స్వాధీనంలో ఉండాలని ఒకటే తపన. ఐతే ఆ కుర్చీని "నర్సాపూర్ కుర్చీ"అని పిలవడానికి అలవాటు పడ్డాడు మన జంబునాథం. చిన్నప్పుడు వాళ్ళింట్లో ఆ మారు మూల పల్లెలో ఒక నర్సాపూర్ కుర్చీ ఉండేది. దానిని వసారాలో వేయించుకుని, తన తండ్రి అందులో మాత్రమే కూర్చుని కరణీకం చేసేవాడు. పిల్లలు ఇంకెవరైనా కూర్చుంటే, తల్లి బ్రహ్మ ప్రళయాన్ని సృష్టించేది. అడపాదడపా తండ్రి ఇంట్లో లేనప్పుడు దొంగచాటుగా అందులో కూర్చుని ఏదో గొప్ప విక్రమార్కుని సింహాసనంలో కూర్చున్నంత ఆనందాన్నీ, అనుభూతినీ ఆస్వాదించే వాడు. మన చిట్టి పొట్టి బాల జంబునాథం పెద్దయిన తర్వాత అంటే తండ్రి కాలం చేసాక చేసిన పంపకములలో ఆ నర్సాపూరు కుర్చీ కాస్తా జంబూ అన్నగారికి హక్కు భుక్తమైపోయింది.

"నువ్వు బస్తీలో ఉద్యోగం చేస్తున్నావు గదా! ఈ కాలపు ఫాషన్లకు తగ్గట్లుగా ఫర్నిచర్లూ, సోఫాలూ కొనుక్కో జంబూ!" అని పెద్దల ఉచిత సలహా! ఆ విధంగా మన జంబునాథము గారి కోరిక నెరవేర లేదు.

****

ఐతే ఈ మధ్యనే అనుకోకుండా అతని చిన్ననాటి స్నేహితుడు నాగప్ప తటస్థపడ్డాడు. నాగప్ప చెయ్యి తిరిగిన వడ్రంగి. ఆతన్ని చూడంగానే తన మధుర వాంఛకు చిత్రీక పట్టడము మొదలెట్టాడు జంబునాథం.నాగప్పకు సరీగా తెలీదుగానీ,జంబు చెప్పిన ఐడియా ప్రకారమే మొదలెట్టి,అద్భుతంగా కుర్చీని తయారు చేసాడు. మొత్తం మీద డబ్బు బాగా వదిలినా నర్సాపూరు కుర్చీని మించిన కుర్చీని తయారు చేసాడు మన హీరో!



దిగ్విజయాన్ని సాధించిన సామ్రాట్టులా మహదానందంతో ఓ చిన్న లారిలో స్వగ్రామం నుండి తయారించిన ఆ ఆసనంతో దిగాడు ఓ సుదినాన. శ్రీమతి ఆశ్చర్యంతో తొంగి చూసింది. భువన విజయము కొలువు కూటములో శ్రీ కృష్ణ దేవరాయలు కూర్చునేటంత గొప్ప రత్న సింహాసనము అంత పెద్ద కుర్చీని నలుగురు కూలీలు సోపాలు పడుతూ మోసుకొచ్చి ఇంట్లో పెట్టారు. జంబు ఐదు రూపాయలు బోతే, "ఇంత బరువును తెచ్చాం బాబూ! మా కష్టానికి కిట్టదు."అంటూ భీష్మించుక్కూర్చుని ఇరవై రూపాయలు వసూలు చేసి రొండిన దోపుకుని వెళ్ళిపోయారు.

విజయగర్వంతో కాలరెగరేస్తూ భార్య వైపు చూసాడు. కానీ ఆమె వదనారవిందంలో జంబు ఆశించిన ఫీలింగ్సేమీ అగుపడ లేదు. "మనం ఉంటూన్న ఒకటిన్నర గది అద్దె కొంపలో ఇంత పెద్ద కుర్చీని పెట్టుకునేటందుకు చోటేదీ? నా నెత్తిన పెట్టండి సరిపోతుంది" అంది ఆవిడ ధుమధుమలాడుతూ!

*******

నిజమే!తనా సంగతినే ఆలోచించ లేదు.ఈ గదీ,వెనకే వంటిల్లూ!ఇప్పుడీ కుర్చీ పక్కనుండి ఒక సన్నటి మనిషి మాత్రమే నడవ గలిగే చోటు మిగిలి ఉన్నది. 

తర్వాత మూడు నెలలు ఎలాగోలాగ కాస్త ఇబ్బందిగానే గడిచి పోయాయి. ఓ సారి జంబు క్యాంపు కెళ్ళి,వారం తర్వాత వచ్చేసరికి జంబూకు,తన గృహాంగణములో రెండు స్టూళ్ళూ, ఒక టీపాయ్ అగుపించాయి. తెప్పరిల్లి, తేరుకునీ చూసేసరికి అవి నర్సాపూరు కుర్చీ రూపాంతరాలే అని అర్ధమై పోయింది. శ్రీమతి పాపం చాలా కష్టపడి తన పుట్టింటి వారి ఆస్థాన వడ్రంగి దగ్గర కూర్చుని మరీ చేయించిందట!! నర్సాపూరు కుర్చీ కాస్తా రూపును మార్చుకుని,ఎత్తిన ఈ మూడు అవతారాలను ప్రదర్శిస్తూ అన్నది భార్య "ఇప్పుడు గది నిండుగా, అందంగా పొందిగ్గా ఉన్నది కదండీ!" వాటిని దర్శిస్తూ పూర్ జంబునాథం ఖిన్నుడై అలాగే నిలువునా నిలబడిపోయాడు.

(చతుర,అక్టోబరు సంచికలో ప్రచురణ) 

Views (110) | Comments (1) |
Add to Yahoo MyWeb

0 Comments:

Post a Comment